Minister Komatireddy Venkat Reddy Comments On BRS : బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. నూటికి నూరు శాతం బీఆర్ఎస్, బీజేపీలో విలీనం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోంది : నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దొనకల్ గ్రామంలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. నల్గొండలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రుణ మాఫీకి 31 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందన్నారు.
"చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లగానికీ కూడా తెలుసు. అది మీరు త్వరలోనే చూస్తారు. ఎందుకంటే జరిగే విషయాలు మాకు తెలుసు కాబట్టి మేముచెప్పే మాట ముమ్మాటికి వాస్తవం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు అడ్రస్‌లేకుండా చేస్తాం. అప్పటికే మీ పార్టీ(బీఆర్ఎస్) బీజేపీలో విలీనమౌతుంది. ఒక వేల ఉన్నా అడ్రస్ ఉండదు"- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనేదే లక్ష్యం : నల్గొండ నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ ప్రధాన ఆస్పత్రిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ఆరు నెలల నుంచి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు. నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్ లో నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. నల్గొండ పట్టణంతోపాటు, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
లోటు బడ్జెట్లో ఉన్నా - ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి