Kishan Reddy And Chiranjeevi Chitchat : తాను మొదటిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత అక్కడి వాతావరణం, శాసనసభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసి షాకయ్యానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సరదాగా ముచ్చటించారు.
సమస్యలపై ఎక్కవగా మాట్లాడే వ్యక్తిని మిమ్మల్నే చూశా : ‘‘ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. నాకు ఒకపక్క మీరు (కిషన్‌రెడ్డి), మరోవైపు జయప్రకాశ్ నారాయణ కూర్చుని ఉండేవారు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, దుర్భాషలాడుకుంటూ లైవ్‌లో తిట్టుకోవడం చూసి షాకయ్యా. అసెంబ్లీ అంటే ఇలా ఉంటుందా? అనుకున్నా. ఆ తర్వాత అదే నాయకులు లాబీల్లో ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకుని మాట్లాడుకోవటం చూసి ఆశ్చర్యపోయాను. నాకు తెలిసినంత వరకూ మీరు (కిషన్‌రెడ్డి) అసెంబ్లీలో ఎప్పుడూ ఎవరినీ దుర్భాషలాడేవారు కాదు. కేవలం మాట్లాడాల్సిన అంశాలు, ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడేవారు తప్ప ఒక్కరోజు కూడా ఇతర విషయాలు మాట్లాడేవారు కాదు. ఒకరకంగా సభా మర్యాద మీ నుంచే నేర్చుకున్నాను." అని కిషన్‌రెడ్డితో చిరంజీవి అన్నారు.
"నేను కేంద్రమంత్రి అయిన తర్వాత రేణిగుంటలో కలనరీ ఇనిస్టిట్యూట్ కోసం అనుమతులు తీసుకొచ్చేందుకు ఎంతో ప్రయత్నించా దానికోసం అప్పటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా అందుకు ఆసక్తి చూపలేదు. కానీ, ఆయనకు అన్నీ వివరించి ఎంతో మాట్లాడి ఒప్పించా. పలు రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు ఉన్న దేశం మనదని అన్నింటినీ నేర్పించే అవకాశం కల్పించాలని ఆయనకు వివరించా. ప్రణాళిక సంఘం అధ్యక్షుడితో మాట్లాడి ఒప్పించాను. శంకుస్థాపన చేసే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. అదే సమయంలో నేను రాజీనామా చేశాను. అయితే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయడంతో చాలా సంతోషపడ్డా."
‘‘కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన కార్మికులకు నావంతు సహాయం చేశా. బ్లడ్ బ్యాంకు ద్వారా సేవ చేయడానికి కారణం నా అభిమానులే. వారి సహకారం వల్లే ఎంతో మందికి సాయం చేయగలుగుతున్నా. కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కశ్మీర్‌లో జరిగిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు కానీ అనుకోని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నా తరపున రామ్‌చరణ్‌ను పంపించాను. ఆ సమయంలోనే ‘ఆర్ఆర్‌ఆర్’కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశానికి మంచి గుర్తింపునిచ్చింది. అలాగే, అయోధ్య సమస్య చాలా సునాయాసంగా పరిష్కారమైంది. అదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు నన్ను ఆహ్వానించడం మా అదృష్టంగా భావించాను. నా జీవితంలో ఆ రోజును ఎప్పుడూ మర్చిపోలేను. ఈ ఎన్నికల్లో మీకు సంపూర్ణ విజయం చేకూరి, మరిన్ని ఉన్నత పదవులువ చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు.
అప్పటినుంచి జమ్మూలో 300పైగా సినిమా షూటింగ్‌లు అయ్యాయి :
‘‘ఆర్టికల్-370 రద్దు చేశాక కశ్మీర్‌లో 300లకు పైగా సినిమాలకు షూటింగ్‌లు జరిగాయి. పార్టీలో నాకంటూ ప్రత్యేకంగా ఎలాంటి గ్రూపులు లేవు. నా తర్వాత కుటుంబ సభ్యులెవరినీ ఇప్పటివరకూ రాజకీయంగా ప్రోత్సహించ లేను. భవిష్యత్‌లో వస్తారేమో నాకు తెలియదు. కరోనా సమయంలో హోంశాఖ సహాయ మంత్రిగా పని చేశాను. ఆ సమయంలో కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అది 24 గంటలూ పనిచేసేది. దాదాపు నెల రోజుల పాటు ఆఫీస్‌లోనే పడుకుని వీలైనంత ఎక్కువ సమయం ప్రజలకు అందాల్సిన సాయం గురించి చర్చిస్తుండే వాడిని. దిల్లీ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, మరీ ఆస్పత్రులకు పంపించే వాళ్లం. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారిని ప్రత్యక్షంగా కలిసి అందుకున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నాను. నా కుటుంబ సభ్యులు నేను ఆసుపత్రుల్లో తిరగడం చూసి భయపడేవాళ్లు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టిన పని చేస్తుంటే, నేను బయటకు రాకుండా ఉండలేకపోయాను. ఏదైతే అది అయిందని మొండిగా ముందుకు వెళ్లాను. ప్రజల కోసం పని చేశాను.’’ అని కిషన్ రెడ్డి తన అనుభవాలు పంచుకున్నారు.
ఆ ఫొటోలకోసం ఫోన్ చేశారు : ‘‘ప్రధాని మోదీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అడ్వాణీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీజీతో కలిసి అమెరికా వెళ్లాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ అనే యూఎస్‌లో ప్రభుత్వ ఏజెన్సీ ఉంది దాని ద్వారా కొన్ని ముఖ్య దేశాలకు చెందిన యువ రాజకీయ ప్రతినిధులను వారి దేశానికి పిలిచేవారు. అక్కడ వారి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూసి, మన దేశంలో ప్రచారం చేయాలని చెప్పేవారు. ఆ సమయంలో అడ్వాణీ సూచన మేరకు అప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను, కర్ణాటక నుంచి అనంత్‌కుమార్, గుజరాత్ నుంచి మోదీకి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో నాకు కనీసం పాస్‌పోర్ట్ కూడా లేదు. విమానం మొదటిసారి ఎక్కాను. అప్పుడు వైట్ హౌస్ ముందు నిలబెట్టి, ఏ భవనం ఏంటో చెప్పేవారు. అప్పటి ఫొటోల్లో కొన్నింటిని నేను భద్రంగా దాచుకున్నా మరికొన్ని పోయాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి వైట్‌హౌస్‌కు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి, ఫొటోల గురించి అడిగితే, నా దగ్గర ఉన్న వాటిని ఆయనకు పంపాను. ‘'అప్పుడు మనం బయట నిలబడి ఫొటోలు దిగాం. ఇప్పుడు అదే నేను వైట్‌హౌస్ లోపలికి వెళ్తున్నా'’ అని మోదీ అన్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
ఆ ఆందోళనతో ఆరోగ్యశ్రీకి బీజం : ‘‘2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తూ ఉండేవారు. ఆయన వివిధ జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు గుండె జబ్బులున్న పిల్లలు బాధపడుతున్నారు. చికిత్స అందక అప్పటికే చాలా మంది చనిపోయారు. ఆ సమయంలో రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. గుండె జబ్బు సమస్యలతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడికి తీసుకొచ్చిన పిల్లల్లో ఒక చిన్నారి చనిపోయాడు. దీంతో ఆ భౌతికకాయం పట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాం, 'చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్ చేయించాలి’అని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశాం. రాత్రి 10గంటలకు సీఎం ఫోన్ చేసి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇవ్వడమే కాదు, అధికారికంగా ప్రకటించారు.
ఈ విషయంపై మరుసటి రోజు వైఎస్సాఆర్‌తో చర్చించాం. ఆయన ప్రభుత్వ వైద్యులను పిలిచి సమస్యకు పరిష్కారం చూపమని అడిగారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామగ్రామాన సర్వే చేపట్టగా 2లక్షల మంది చిన్నారులు గుండె జబ్బులతో బాధపడుతున్నారని తెలిసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎలా చేయాలి అని ఆలోచించారు ఈ క్రమంలో వారికి ఇన్సూరెన్స్ చేయించాలని నిర్ణయించారు. ఆ ఆలోచన నుంచే ఆరోగ్యశ్రీ పథకం పుట్టింది’ అని కిషన్‌రెడ్డి తన అనుభవాలను చిరంజీవితో పంచుకున్నారు.