Lok Sabha Elections Campaign In Telangana 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో గెలుపు దిశగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలు పెట్టారు. దేశంలో బీజేపీ నిరంకుశ పాలనను అంతమొందించాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు.
Congress MP Candidate Danam Nagender Comments : కేసీఆర్ గొప్ప నాయకుడే కానీ పక్కననున్న వాళ్లే ఆయన్ను బ్రష్ఠు పట్టించారని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆరోపించారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు కాంగ్రెస్ ప్రముఖులతో కలిసి హాజరయ్యారు. పార్టీ మార్పుపై స్పందించిన దానం ఫిరాయింపుల అంశంలో గతంలో బీఆర్ఎస్ చేసింది ఏంటని ప్రశ్నించారు. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణలో నిజం లేదని దానం కొట్టిపారేశారు.
Parliament Elections Campaign 2024 : సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన 9 నెలల లోపు 100 కోట్ల రూపాయల సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చు పెడతానని వెంకట్రామిరెడ్డి వాగ్దానం చేశారు. దుబ్బాకలో గెలవలేని అభ్యర్థిని మెదక్ లోక్‌సభ స్థానానికి బీజేపీ పోటీ చేయిస్తోందంటూ రఘునందన్ రావును ఉద్దేశించి హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీతో కలవలేదనే కవితను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
తెలంగాణలో 17 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానానికి మోగిన ఎన్నికల నగారా - పోలింగ్ ఎప్పుడంటే?
Lok Sabha Polls 2024 : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నీరు లేక పంటలు ఎండుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. వరికి ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ చెల్లించకపోతే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. కుటుంబం ఆపదలో ఉంటే ఆయనతో అవసరం తీరిన నాయకులు పార్టీ ఫిరాయింపులపై దృష్టిసారించారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆమె పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
దేశానికి మోదీ నాయకత్వమే శ్రీరామరక్ష : దేశానికి మోదీ నాయకత్వమే శ్రీరామరక్ష అని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు అభ్యర్థులు కరవై ఇతర ప్రాంతాల వారిని తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఈసారి కచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు ధీమా వ్యక్తం చేశారు.