Lok Sabha Elections Campaign In Telangana 2024 : రాష్ట్రంలో మండువేసవితో ఎండలు ఠారెత్తుతుండగా నేతల వాగ్బాణాలతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యనేతల సమావేశాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ ఇటీవల ఆ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, సీపీఐ నేతలను కలిశారు. ములుగులో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి సీతక్క(Seetakka) మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్‌ను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు.
Congress MP Elections Campaign : లీకులు, ఫేకులతో రాష్ట్రంలో ప్రభుత్వం సాగుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడటాన్ని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ తప్పుబట్టారు. పదేళ్లుగా ప్రజల్ని మభ్యపెట్టి, రాష్ట్రాన్ని నాశనం చేసినందునే ప్రజలు గులాబీ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. నాగర్‌కర్నూల్‌లో జరిగిన సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. నేతలంతా సమష్టిగా ముందుకుసాగి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కృష్ణాజలాల్లో అన్యాయం, కాళేశ్వరంలో తలెత్తిన పరిస్థితులకు కేసీఆరే కారణమని మంత్రి జూపల్లి ఆరోపించారు. పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసి, అధికారం కోల్పోయిన తర్వాత రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పంగా ఉందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధికి, అబద్దాల కాంగ్రెస్‌కు మధ్య ఎన్నికలు : వికారాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి కేటీఆర్(KTR) గులాబీ పార్టీ పదేళ్ల అభివృద్ధికి, అబద్ధాల కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ భారత్ రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Parliament Elections Campaign 2024 : భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సన్నాహక భేటీలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, అరు గ్యారంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్‌లో వినిపించాలంటే గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.
BJP MP Elections Campaign : హైదరాబాద్ ముషీరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం భువనగిరి కమలం పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఇంటింటి ప్రచారం చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని షాద్‌నగర్, ఫారుక్‌నగర్‌లో కార్యకర్తల సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి డీకే ఆరుణ పాల్గొన్నారు.
మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ గెలుపు కోసం వరంగల్ జిల్లా నర్సంపేటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా చర్లగౌరారంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి సైదిరెడ్డి ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఎండిపోయిన పంటలను పరిశీలించారు.