KTR Discussion on Monetary Exchange Bill : శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. గత రెండు రోజులుగా సభలో వివిధ బిల్లులపై వాడివేడిగా చర్చలు జరిగాయి. నేడు ఉభయసభల్లో చర్చల అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలుపనున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను ప్రారంభించారు.
గత ప్రభుత్వంలో రూ.4 లక్షల కోట్ల ఆదాయాన్ని రూ.14.65 లక్షల కోట్లకు పెంచాంమని కేటీఆర్ తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తలసరి ఆదాయంతో పోటీపడుతున్నట్లు వెల్లడించారు.
రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పడుతున్న కష్టాలు తమకు తెలుసని కేటీఆర్ చెప్పారు. పదేళ్లలో రాష్ట్రసంపద పెరిగిందని భట్టి విక్రమార్క గతంలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రి మాట మారుస్తున్నారని ఆరోపించారు. అప్పుల విషయంలో ప్రభుత్వమే అసత్య ఆరోపణలు చేస్తుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, ఉన్న పెట్టుబడులు పోతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌లో అప్పగిస్తే అప్పుల కుప్పగా ఇచ్చారని పదేపదే విమర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2014లో తెలంగాణ రెవెన్యూ మిగులు రూ.369 కోట్లు మాత్రమే అని తెలిపారు. 2022-23 నాటికి రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు 209 కోట్లు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పగించామని పేర్కొన్నారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థికమంత్రి చెబుతున్నారని, కానీ బడ్జెట్‌లో మాత్రం రెవెన్యూ మిగులు ఉందని ఎలా చూపించారని ప్రశ్నించారు.
కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా గత ప్రభుత్వంలో జీతాలు సక్రమంగానే ఇచ్చాం. కరోనా అయినా, ఆర్థిక సంక్షోభమైనా, రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగవద్దని అనుకున్నాం. కానీ, ఇప్పటికి కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు, మెడికల్ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ పాలనలో అప్పులు రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నాయి. మా ప్రభుత్వంలో చేసిన నికర అప్పులు రూ.3,85,340 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వ అప్పులు చెప్పిన వాళ్లు, సృష్టించిన ఆస్తుల గురించి కూడా చెప్పాలి. సంపద చూస్తేనే అప్పులు ఇస్తారు. - కేటీఆర్, మాజీ మంత్రి