KTR Reacts On Congress Protest in Telangana : అదానీని ఆహ్వానించి ప్రోత్సహకాలు అందించిన రేవంత్ రెడ్డి అండ్ కో ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలపడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సెబీ ఛీఫ్ మాధాబి పూరీ బుచ్ రాజీనామా చేయాలంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆందోళనలపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను చూసి ద్వంద్వనీతి కూడా ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు స్ల్పిట్ పర్సనాలిటీ వ్యాధితో బాధపడుతున్నారా అని ఎద్దేవా చేశారు.
కాగా సెబీ చీఫ్ మాధాబి పూరీ బుచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేయనుంది. సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదాభి తక్షణమే ఆమె తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదానీ మెగా కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినప్పటికి కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.
Galli Mein Dosti
— KTR (@KTRBRS) August 22, 2024
Dilli Mein Kusti
Yeh Hi Hain Congress
Can you please explain @RahulGandhi Ji ? https://t.co/0gZqXgZWWo
గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసనలు : అదానీ షేర్లు బదిలీ చేసినట్లు హిండెన్ బర్గ్ సంస్థ చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలో ఏఐసీసీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఈడీ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఆయా రాష్ట్రాల పీసీసీలను ఆదేశించింది. గురువారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గన్ పార్క్ వద్ద సమావేశం అవుతారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అక్కడ నుంచి ఈడీ కార్యాలయ వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ ఈడీ కార్యాలయం బయట సీఎంతో సహా కాంగ్రెస్ నాయకులు అంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్