KTR on Jobs Filled Under his Govt Rule : పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు మాత్రమే ఉన్న రాష్ట్రాలు దేశంలో తెలంగాణ తప్ప వేరే ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అటెండర్ మొదలు గ్రూప్ వన్ ఉద్యోగాల వరకు 95 శాతం స్థానికులకే సాధించిన ఘనత కేసీఆర్‌ది మాత్రమేనని చెప్పారు.హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
KTR Fires on Congress : 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి నియామక బోర్డు తలపెడితే అప్పటి గవర్నర్ అడ్డుపడ్డారని, 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకోవడం ముఖ్యమంత్రి రాజకీయ దివాళా కోరుతనంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పదేళ్లలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఏడాదికి 19,000 ఉద్యోగాలు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్ : కేసీఆర్ హయాంలో 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి, రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 24 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో అన్ని రకాలుగా 26 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్నీ మోసాలేనని కేటీఆర్ ఆరోపించారు. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలని కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. తాము కష్టపడి తీసుకొచ్చిన ప్రైవేట్ పరిశ్రమలకు ముఖ్యమంత్రి పాతరేస్తున్నారని విమర్శించారు. బిల్డర్లపై ఆర్, బీ, యూ ట్యాక్స్‌లు వేస్తున్నారని, రేపో మాపో ఎక్సైజ్ దుకాణం తెరిచి జూపల్లి ట్యాక్స్ కూడా వస్తుందని అంటున్నారని వ్యాఖ్యానించారు. దిల్లీకి సామంత రాజుల్లా కప్పం కడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందో ఆలోచించాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విద్యావంతులు సరైన నిర్ణయం తీసుకోవాలి. యువత ఆశలు నెరవేరాలంటే ఎమ్మెల్సీ ఉపఎన్నికలో రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలి. కేఏ పాల్ తరహాలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జోకులు వేయాల్సి వస్తోంది. కరెంట్ పోతుందని మంత్రి నోటి నుంచి మాట ఎలా వస్తుంది. ఎలాంటి మూర్ఖులు, జోకర్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం చేసుకోవాలి. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలుగా అభివర్ణించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. 20,000ల మెగావాట్ల వ్యవస్థ అప్పగిస్తే సన్నాసులకు నడపడం చేత కావడం లేదు. మేడిగడ్డలో మొన్నటి వరకు తిట్టి ఇపుడు కేసీఆర్ చెప్పిన మార్గానికే వచ్చారు." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
వైద్య రంగంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఓ అరుదైన విప్లవం : కేటీఆర్ - KTR Tweets On Health Sector