KTR MLC Election Campaign in Khammam : 56 కేసులు, 70 రోజుల పాటు జైళ్లో ఉన్న బ్లాక్ మెయిలర్ కావాలో, ఉన్నత విద్యావంతుడు, గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి పట్టభద్రుల పక్షాన గళం వినిపించే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి కావాలో విద్యావంతులు ఆలోచించాలని బీఆర్‌ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించిన పట్టభద్రుల సభల్లో ఆయన పాల్గొన్నారు.
BRS Graduate Meeting in Khammam : విద్యావంతులు, పట్టభద్రుల నిర్లిప్తత ఉదాసీనత సమాజానికి ప్రమాదకరమని కేటీఆర్ అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వ్యక్తి ఎలా పట్టభద్రుల ప్రతినిధి అవుతాడని ప్రశ్నించారు. ఉన్నత విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ఉద్యోగులు, విద్యావంతులు, నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే గళంగా పనిచేస్తాడని తెలిపారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపిందని మండిపడ్డారు. ప్రజలకు అభయ హస్తంమంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత భస్మాసుర హస్తం చూపిస్తుందన్నారు.
KTR Comments on Teenmar Mallanna : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులు, విద్యార్థుల్ని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. పోటీ పరీక్షలకు ఎలాంటి రుసుం ఉండబోదని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు రెండింతలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను ఉంచే సత్తా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
"తొమ్మిదిన్నరేళ్లలోనే దేశంలో తెలంగాణను అగ్రభాగాన పెట్టిన ఘనత బీఆర్‌ఎస్ సర్కారుదే. దేశంలోనే అత్యధికంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. విద్యావంతులు, మేధావుల గొంతుకగా ప్రశ్నించే గళంగా పెద్దల సభకు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి అవకాశం ఇవ్వాలి. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు