BRS Leader KTR on KCR Banning Election Campaign : స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుందని, బీజేపీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం నడుస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మోదీ దారుణంగా మాట్లాడినా కనీసం ఈసీ స్పందించలేదని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.
మోదీ, అమిత్ షా మత వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినా ఈసీ చర్య తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదని అన్నారు. 20 వేల పైచిలుకు ప్రజలు ఈసీకి ఫిర్యాదు చేసిన కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భయపడి నడ్డాకు లేఖ రాశారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీరాముని బొమ్మ పట్టుకొని ప్రచారం చేశారని ఫిర్యాదు చేసిన చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పక్షాన మాట్లాడితే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిపై ఈసీకి బీఆర్‌ఎస్ ఎనిమిది ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని తెలిపారు. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీకు నిద్ర పట్టలేదని పేర్కొన్నారు. ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా గోడకు మొరపెట్టుకున్నట్లు ఉందని ఆయన మండిపడ్డారు.
"బీఆర్‌ఎస్‌కు 12 ఎంపీ సీట్లు వస్తాయని కాంగ్రెస్, బీజేపీ సర్వేల్లో తేలింది. కేసీఆర్ విషయంలో ఈసీ ఆగమేఘాలపై నోటీసు ఇచ్చారు. రైతుల దుస్థితి చూసి బాధతో భావోద్వేగంతో కేసీఆర్ సిరిసిల్లలో మాట్లాడారు. ప్రజలు, రైతులు, నేతన్నల తరఫున మాట్లాడిన కేసీఆర్ గొంతును నొక్కారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సూక్తులుగా వినిపిస్తున్నాయి. ఈసీకి మెుత్తం 27 ఫిర్యాదులు ఇచ్చాం. కేవలం కొండా సురేఖను మాత్రమే మందలించారు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించగానే బీజేపీ, కాంగ్రెస్‌కు దడపుట్టింది. కేసీఆర్ వాస్తవాలు చెబుతుంటే తట్టుకోలేక ఇలా చేస్తున్నారు." - కేటీఆర్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ శైలి : బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయన్నారు. ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని కోరుతున్నారని తెలిపారు. ఈసీ మోదీ, రేవంత్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని, ఒక పార్టీ, కొందరి కనుసన్నల్లో పని చేస్తున్నట్లుందని అన్నారు. ఎన్నికలు ఇలాగే కొనసాగితే ప్రశాంత, పారదర్శకత ఎక్కడిదని ప్రశ్నించారు. 48 గంటల పాటు తాత్కాలికంగా అపారేమో కానీ, ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.