Koneru Konappa To Join Congress : బీఆర్ఎస్ అసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. రేపు మంత్రి సీతక్క సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్(Congress) కండువా కప్పుకోనున్నారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే(MLA) కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు ప్రస్తుత జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కోనప్ప పార్టీని వీడనుండటంతో ఎంతమంది ద్వితీయ శ్రేణి నేతలు ఆయన వెంట నడుస్తారనేది ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనప్ప పార్టీ కోసం అన్నీ తానై ముందుండి నడిపించే వారు. పార్లమెంటు(Parliament) ఎన్నికల నేపథ్యంలో బలమైన నాయకులు, మండల, గ్రామస్థాయిలో పట్టున్న నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారనుందనే వాదన ఉంది.
'సిర్పూర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా'
Koneru Konappa Resigns To BRS : ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ సిర్పూర్ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి, తుమ్ములేటి ప్రాజెక్టు కోసం చాలా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ అంశాలపై ఇటీవలే ముఖ్యమంత్రిని కలిసి వివరించామని పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కోనేరు కోనప్ప స్పష్టం చేశారు.
ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు పార్టీని వీడారు. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు కూడా కారు దిగి చేయందుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇతర ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో వారు కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ గందరగోళంలో పడింది.
"గత మూడు నెలలు క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత దూషణలు, తగాదాలు చేయడం లాంటివి చూశాం. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్తో కలిసి పోటీ చేద్దామనే నిర్ణయానికి రావడం చాలా బాధ కలిగించింది. కేసీఆర్ విధానాలు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. కేవలం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇన్నాళ్లు నడిచాను. వినయ్ గార్డెన్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు సీతక్క సమక్షంలో పార్టీలో చేరనున్నాను"- కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే
నిరుపేదల ఆకలి తీరుస్తోన్న ఎమ్మెల్యే.. నిత్యం వెయ్యి మందికి అన్నదానం..
Mla Konappa: అది నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కోనప్ప