Minister komatireddy React on KCR Bus Yatra : రాష్ట్రంలో 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ శకం ఇక ముగిసిందన్నారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
నీటి వాటాల పంపకాల్లో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరవు వచ్చిందని మండిపడ్డారు. మిర్యాలగూడకు కేసీఆర్ ఏ మొఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. పది సంవత్సరాల్లో ఏమీ చేయని కేసీఆర్, బస్సు యాత్ర ద్వారా ఏం చేస్తారని నిలదీశారు. కారు పార్టీ ఒక్క సీట్ కూడా గెలవదని, మెదక్ స్థానం ఒక్కటి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తాను పిలిస్తే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
"రాష్ట్రంలో 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. కేసీఆర్ శకం ఇక ముగిసింది. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. నేను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్కు డిపాజిట్లు రావు." - కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
Minister komatireddy Interesting Comments : నల్గొండ, భువనగిరిలోని గులాబీ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల గురించి గుత్తా సుఖేందర్ రెడ్డికి బాగా తెలుసని అన్నారు. బస్సు యాత్ర కాదు మోకాళ్లు యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోంది మంత్రి కోమటి రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.