Kishan Reddy Comments on Congress : తెలంగాణలో బీజేపికి సానుకూల వాతావరణం ఉందని, అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకే వస్తాయని స్పష్టం చేశారు. అమలు కానీ హామీలిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాహుల్ గాంధీ(Rahul Gandhi)మాత్రం ఈ జన్మలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 17 సీట్లు గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
Kishan Reddy meeting with BJP Leaders : రాహుల్ గాంధీ ప్రధాని కాకపోతే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని రేవంత్ రెడ్డి(CM Revanth)చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి అండగా ఉండటానికి తెలంగాణ మహిళలు స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారని, మోదీ ప్రధాని కావాలని అంటున్నారని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార వ్యూహాలపై అభ్యర్థులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికలు దేశానికి దేశ భవిష్యత్‌కు సంబంధించినవి : ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవాలని, ఏ పోలింగ్ బూత్‌కు ఆ పోలింగ్ బూత్ వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు కిషన్‌రెడ్డి సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గెలవాలని, ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక ముఖ్య నేతను సమన్వయ కర్తగా నియమించాలని ఆదేశించారు. తాను కూడా ఒక పోలింగ్ కేంద్రానికి కో ఆర్డినేటర్‌గా ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికలు దేశానికి దేశ భవిష్యత్‌కు సంబంధించినవని, మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన మోదీ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని నేతలకు పిలుపునిచ్చారు.
'రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 17 సీట్లు గెలిచే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. వచ్చే జన్మలో ఏమవుతారో చెప్పలేం. ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయలేమని ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెబుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లిన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి అండగా ఉంటామని తెలంగాణ మహిళలు సిద్ధంగా ఉన్నారు.'- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఆధారాలు లేకుండా ఫేక్ న్యూస్ రాస్తే ఊరుకునేది లేదు : కేటీఆర్ - KTR Fires on CM Revanth