KCR Election Campaign in Suryapet : సూర్యాపేట గడ్డమీద గులాబీ జెండా ఎగరాలని, దిల్లీ పార్లమెంట్లో మన గొంతు వినపడాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడలో ప్రారంభమైన బస్సు యాత్ర అనంతరం, సూర్యాపేట జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించి మాట్లాడారు.
పెద్ద ఎత్తులో పార్టీ శ్రేణులు, నాయకులు కదిలిరావడంతో పట్టణమంతా గులాబీ మయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి పట్టణానికి కేసీఆర్ రావడం వల్ల భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్, సూర్యాపేట పోరాటాల ఖిల్లా అని కొనియాడారు.
"ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకున్నాం. అదే కోవలో సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపించుకున్నాం. సద్దుల చెరువును ముద్దుల చేరువుగా మార్చుకున్న ఘనత బీఆర్ఎస్దే. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు అందరికీ ఇచ్చాం, కానీ ఈసారి ఆ స్కీం ఉంటుందో ఉండదో తెలియదు."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
BRS Chief KCR Fires on Congress : కాంగ్రెస్ పాలనలో 30 ఏళ్లు మూసి మురిగి నీళ్లు తాగడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే సమస్య ఉత్పన్నమయ్యేలా ఉందన్నారు. ఈ క్రమంలోనే మిషన్ భగీరథ నీళ్లు మాయమయ్యాయని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వంలో 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు.
బోగస్ మాటలతో ఆరు హామీలకు పంగనామం : రాష్ట్ర రైతాంగం అకాల వర్షాలకు నాశనమై, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతున్నా కనీసం కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని, ఇప్పటివరకు చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు గాలికి వదిలేసి, బోగస్ మాటలతో పంగనామం పెడుతోందని పేర్కొన్నారు.
జైలుకు వెళ్లేందుకు నేను ఎన్నడూ భయపడలేదు : కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేరన్న ఆయన, ఇవాళ ఇక్కడే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నా, నీళ్లు ఇవ్వడం చేతకావడం లేదంటూ ధ్వజమెత్తారు. 5 టీఎంసీల నీళ్లు టైల్ పాండ్ నుంచి ఏపీ వాళ్లు తీసుకువెళ్తుంటే మీరేమి చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కేసులకు, జైళ్లకి భయపడే వ్యక్తి కాదని, అలా జైలుకు వెళ్లేందుకు తాను భయపడివుంటే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు.
ప్రాణం పోయిన పర్వాలేదని, తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులందరికీ రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే కాంగ్రెస్తో కొట్లాడి మన హక్కుల సాధించుకోవచ్చని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ బోగస్ మాటలతో ఆరు హామీలకు పంగనామం పెట్టింది : కేసీఆర్ - KCR BUS Yatra In Telangana