Justice PC Ghose Judicial Inquiry on Kaleshwaram : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో తదుపరి ప్రక్రియ ఈవారం ప్రారంభం కానుంది. మొదటి దశ విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది. ఆనకట్టలకు సంబంధించిన వివిధ అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకోవడంతో పాటు అవసరమైన వివరాలు ఆరా తీసింది. వారు చెప్పిన అంశాల ఆధారంగా కమిషన్ ఓ అవగాహనకు వచ్చింది.
కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆ గడువు ముగిసింది. వాటిని విశ్లేషించిన అనంతరం కమిషన్ తదుపరి ప్రక్రియ ప్రారంభించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ వచ్చే నెల ఐదో తేదీన రాష్ట్రానికి రానున్నారు. పది రోజుల వరకు ఇక్కడే ఉండి విచారణ తదుపరి దశ కొనసాగించనున్నారు. అఫిడవిట్లు, అందులోని సమాచారం ఆధారంగా మరి కొంత మందికి నోటీసులు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చిన సమాచారం, అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సాంకేతిక అంశాలు, ఆ తర్వాత ఆర్థిక పరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారిస్తోంది. ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికలు, అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకొని కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగించనుంది. కమిషన్కు ఇచ్చిన గడువును మరో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆగస్టు 31 వ తేదీ వరకు కమిషన్ నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆచితూచి వ్యవహరిస్తున్న అధికారులు: కమిషన్కు ఎవరు, ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు పీసీ ఘోష్ ఇప్పటికే వెల్లడించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వారిపై చర్యలు ఉంటాయనీ ఆయన గతంలో ప్రకటించారు. అఫిడవిట్లు అన్ని పరిశీలించాక అవసరమైన వారిని విచారణకు పిలుస్తామని, లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని పీసీ ఘోష్ పేర్కొన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయన్న అంశాలు రికార్డు రూపంలో వచ్చిన నేపథ్యంలో విచారణను వేగవంతం చేయనున్నారు.