LOK SABHA ELECTIONS 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు ఇతర పార్టీల కీలక నేతలను తమలో చేర్చుకుంటూ బలం పెంచుకునే పనిలో పడింది. ఇతర పార్టీల నేతల చేరికలే లక్ష్యంగా, ఇటీవల ప్రారంభించిన ఘర్ వాప్సి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంతో గతంలో పార్టీని వదిలిపోయిన కీలక నేతలందరూ, మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పెద్దఎత్తున నేతల చేరికతో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కొందరి చేరికలు వివాదాస్పదం కావడం, చేరిన తరువాత స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ తరువాత తాత్కాలికంగా నిలుపుదల చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇకపై నేరుగా చేరికలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీ నేతలను నేరుగా చేర్చుకోకూడదని చేరికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యుడు ఆయన ప్రకటించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఘర్ వాప్సి అయ్యారని జగ్గారెడ్డి తెలిపారు. చేరికలు పెద్దఎత్తున జరిగాయని, ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఇకపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ అనుమతితోనే చేరికలు ఉంటాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పార్టీలో చేరాలనుకునే వారు దీపాదాస్ మున్షీని సంప్రదించాలని ఆయన సూచించారు.
Congress Joining's Committee : కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చొరవ చూపుతున్నారని, ఇటీవల కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పర్యటన వచ్చినప్పుడు చర్చకు వచ్చింది. ఎవరు పార్టీలో చేరేందుకు చొరవ చూపినా ఆహ్వానించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, కోదండరెడ్డితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. హస్తం పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసం, భావ సారూప్యత కలిగిన నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.
ఓట్ల కోసం శ్రీరాముణ్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు : జగ్గారెడ్డి - lok sabha elections 2024