Minister Uttam Visit's Kaleshwaram Barrages : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల ప్రకారం పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ కమిటీ కొన్ని పనులు సూచిస్తూ వేగవంతం చేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరుగుతున్న పనుల పురోగతి, ప్రస్తుత పరిస్థితులు, ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు జరుగుతున్నాయా? అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
ముందుగా హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీకి చేరుకొని, అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం బ్యారేజీని పరిశీలించారు. అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజికి చేరుకొని పనులు పరిశీలించారు. నదీ గర్భంలోకి షీట్ ఫైల్స్ దింపడం, సీసీ బ్లాక్ అమరిక, గ్రౌంటింగ్, గేట్ల కటింగ్ పనుల ప్రగతిని చూశారు. తాత్కాలిక పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో వర్షాలు ప్రారంభమయ్యేసరికి వేగవంతంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పనుల పురోగతిని నేడు పరిశీలించామన్న మంత్రి ఉత్తమ్, మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారని, సుందిళ్ల పనులను వేగవంతం చేయాలని హెచ్చరించామని వివరించారు. ఇరిగేషన్ శాఖను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డ ఆయన, జ్యుడీషియల్ కమిటీ రిపోర్టు ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండిపోయింది. మేడిగడ్డ కుంగినప్పుడే నీళ్లు కిందికి వదిలితే డ్యామేజ్ ఇంతగా ఉండేది కాదని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు పనులు కొనసాగిస్తున్నాం. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయి. సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారు. వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థను హెచ్చరించాం. జ్యుడీషియల్ కమిటీ రిపోర్టు ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి