Aruri Ramesh Party Change : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో రెండు సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్(Aruri Ramesh) ఎట్టకేలకు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. గులాబీ జెండా వదిలేసి కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆధ్వర్యంలో ఆరూరి పార్టీలోకి చేరారు. ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకున్న క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు అన్నీ ఇన్నీ కావు.
ఆరూరి బీఆర్ఎస్‌ను వీడి కమలం గూటికి చేరుతారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని ఆయన భావించారు. గత ఎన్నికల్లో తనకు పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లే ఓటమి చెందానన్నది ఆయన ఆవేదన. వరంగల్ పార్లమెంటు అభ్యర్ధిత్వం కడియం కావ్యకు అధిష్ఠానం ఇచ్చే ఉద్దేశ్యం ఉందని కూడా తెలియడంతో ఇక బీజేపీలోకి వెళ్లేందుకే మానసికంగా సిద్ధమయ్యారు.
Aruri Ramesh Quits BRS : అయితే బీఆర్ఎస్(BRS) పెద్దల జోక్యం చేసుకుని బుజ్జగించడం, వరంగల్ అభ్యర్ధిత్వం ఖాయమని చెప్పడంతో, ఆరూరి కొంత మెత్తబడ్డారు. దీంతో తాను బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరట్లేదని క్యాడర్‌ను గందరగోళపరచడానికి ఈ విధమైన ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. ఆరూరి రమేష్ చేసిన ప్రకటన, కొన్ని రోజులు పార్టీ మార్పు ఊహాగానాలను తెరదించింది. నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అయితే గత వారంలోహైదరాబాద్‌లో అమిత్‌షా రాక సందర్భంగా కమలం నేతలను కలవడంతో, ఆరూరి రమేష్ వెళ్లడం ఖాయమైపోయింది. ఆరూరి బీజేపీ నేతలను కలిసిన ఫోటోలు, వీడియోలు వైరలయ్యాయి. ఇక దీనిపై స్పష్టత ఇచ్చేందుకు, ఈ నెల 13న ఉదయం హనుమకొండలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటూ ఆయన మీడియాకు తెలియచేశారు. ఈ సమావేశంలో హైడ్రామా కొనసాగింది.
ఆరూరి మాట్లాడేందుకు కొద్దిసేపు ముందుగా, బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయకరరావు, బసవరాజ్ సారయ్య తదితరులు వచ్చి ఆయనను బలవతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లడం, పెందుర్తి వద్ద జరిగిన పరస్పరం తోపులాటలో చొక్కా చిరగడం కూడా జరిగింది. మధ్యాహ్నానికి నందినగర్‌లో కేసీఆర్ సమక్షంలో జరిగిన వరంగల్ నేతల సమావేశంలో ఆరూరి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని, తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని, అభ్యర్ధి ఎవరైనా వారి గెలుపుకోసం పని చేస్తానని తెలిపారు.
ఎట్టకేలకు ఆరూరి బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆరూరి రమేష్ పార్టీ మార్పు ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడింది. పార్టీ నాయకులు పార్టీ మారడాలు ఎన్నికల ముందు కప్పదాట్లు సాధారణమే. ఉదయం ఓ పార్టీలో ఉండి సాయంత్రానికి మరో పార్టీ కండువా కప్పుకోవడం కూడా అసాధారణమేమీ కాదు. కానీ పోను పోనంటూనే వేరే పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని తాను వెళ్లాలనుకుంటే అది ముందే బహిరంగంగా వెల్లడించి పార్టీ మారి ఉంటే బాగుండేదన్నది పలువురు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
అత్యధిక మెజార్టీలతో రెండు సార్లు గెలుపొందిన బీఆర్ఎస్ అధిష్ఠానం గుర్తింపు ఇవ్వలేదని అందుకే వెళ్లను వెళ్లనంటూనే బీజేపీలోకి మారి తను అనుకున్నదే చేసి బీఆర్ఎస్ నేతలకు గట్టి షాక్ ఇచ్చారని ఆరూరి అనుచరులు పేర్కొంటున్నారు. ఆరూరి బీజేపీలోకి రావడంతో ఇక వరంగల్ పార్లమెంటు స్ధానానికి ఆయన పేరు వెల్లడి లాంఛనమే కానుంది.
బీఆర్ఎస్కు వరంగల్ ఎంపీ గుడ్‌బై - కాంగ్రెస్ గూటికి చేరిన పసునూరి దయాకర్
కాంగ్రెస్ గూటికి జితేందర్ రెడ్డి - కేబినెట్ హోదా ఇచ్చిన అధిష్ఠానం