Independence Day Celebrations Funds in AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీస మౌలిక వసతులకు కూడా నిధులు లేక పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా పంచాయతీల వద్ద డబ్బు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పంచాయతీలకు స్వాతంత్య్ర దినోత్సవ, గణతంత్ర దినోత్స వేడుకలకు భారీగా నిధులు పెంచింది.
స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా చేసేందుకు ఐదు వేల లోపు జనాభా ఉన్న మైనర్ పంచాయతీలకు రూ. 10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ. 25 వేలకు పెంచుతున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేయడం పట్ల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పంచాయతీ సర్పంచ్‌లు సగౌరవంగా జెండా వందనం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించడం శుభాపరిణామమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ గ్రామంలో పంద్రాగస్టు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 మాత్రమే ఇచ్చేవారు. ఆ డబ్బులతో కనీసం జెండా కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ మొత్తాలను 100 నుంచి 10 వేల రూపాయలకు, 250 నుంచి 25 వేలు రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పడంతో వేడుకలను గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సర్పంచులు ఏర్పాట్లు చేశారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా నిధులు అందిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత తెలిపేలా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం దొరికిందని సర్పంచులు తెలుపుతున్నారు. గతంతో పోలిస్తే కొన్ని వందల రెట్లు నిధులు పెంచి ఇచ్చారంటూ సీఎం చంద్రబాబుకు, పంచాయతీరాజ్‌శాఖమంత్రి పవన్‌కు సర్పంచ్‌లు కృతజ్ఞత చెప్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీల్లో పంద్రాగస్టు వేడుకల్ని పండగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్‌లు తెలిపారు. అదే విధంగా పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాడు కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువలు, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆటల పోటీలు నిర్వహించడంతో పాటు సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని సూచించారు.
ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించాలని, పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమరయోధులు, ఆర్మీలో పనిచేసిన సైనికులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని పేర్కొన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలన్నారు.
జాతీయతను ఉట్టి పడే సమున్నత కార్యక్రమాలు, స్వాతంత్య్ర పోరాట స్పూర్తిని ఇనుమడింప జేసే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం చేయూత అందించడంపై సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని సూచించడాన్ని సర్పంచులు స్వాగతిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలు ప్రగతి పథంలో సాగుతాయని సర్పంచులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"స్వాతంత్య్ర వేడుకలకు మైనర్ పంచాయతీలకు 10 వేలు, మేజర్ పంచాయతీలకు 25 వేల రూపాయలు వాడుకోడానికి మాకు అవకాశం ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. గతంలో మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 మాత్రమే ఇచ్చేవారు. అవి దేనికీ సరిపోయేవి కాదు. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడటానికి పునాది వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము." - సర్పంచులు