TG High Court on BRS MLA's Disqualification Petition : బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ నిర్వహించారు. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఈ పిటిషన్‌పై మరోసారి విచారించారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరన్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 3 నెలల్లో అనర్హతా వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. రాజీనామా చేయకుండా పార్టీ మారడం చట్ట విరుద్దమన్నారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసి 3 నెలలు గడిచినా కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పైగా స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌లోనూ వివరాలు సరిగ్గా లేవని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్‌ఎస్
అనర్హతా పిటిషన్ మంత్రం : నేతల వలసలు భారత రాష్ట్ర సమితి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటం గులాబీ పార్టీకి సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయాలని బీఆర్‌ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. చట్టపరంగా అనర్హత వేటు పడేలా చూడటం ద్వారా ఇతర శాసనసభ్యులు పార్టీని వీడకుండా కట్టడి చేయవచ్చన్నది ఆ పార్టీ ఆలోచన.
అందులో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు భవిష్యత్తులో ఇంకెవరైనా పార్టీని వీడినా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనర్హతా పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నేతలకు స్పష్టం చేసింది. ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా ఛైర్మన్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన రాజ్యసభ సభ్యుడు కేశవరావు అవసరమైతే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో కొంత సమయం తీసుకొని కేకే వ్యవహారంలో పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
గోడ దూకేందుకు సై అంటున్న సర్పంచ్‌లు - ఆశల వలతో రాత్రికి రాత్రే కండువాల మార్పు
పార్టీ ఫిరాయింపులు నివారించేందుకు బీఆర్‌ఎస్ అనర్హతా పిటిషన్ మంత్రం - Lok Sabha Election 2024