Graduate MLC By Poll Campaign : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం పతాకస్థాయికి చేరింది. మరో రోజు మాత్రమే గడువు ఉన్న దృష్ట్యా అభ్యర్థులు, నాయకులు జిల్లాలను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు దేవుళ్లైతే, కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి మాత్రం బానిసలని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న విమర్శించారు. హనుమకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఓటు ద్వారా పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
"మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలంటే బానిసలు లెక్క కనిపిస్తారు. కానీ కాంగ్రెస్‌కు ప్రజలంటే దేవుళ్లు. ఓటర్లంతా మహరాజులు లెక్క కనిపిస్తారు. అది వాళ్లకు మాకు ఉన్న తేడా. ఇప్పుడు బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయి. గులాబీ పార్టీ మాకు ఈ పదవి వద్దని చెప్పినందుకే వచ్చింది. మాకు గ్రాడ్యుయేట్స్ అవసరం లేదంటేనే ఇప్పుడు అనివార్యమైంది. కేటీఆర్ ఏమంటారు వాళ్ల అభ్యర్థి పిట్స్ పిలానీలో చదివాడు అంట, నేను జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నందుకు, ఇక్కడ చదువుకున్నవాళ్లు పళ్లీ, బఠాణీగాళ్లట."- తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
Harish Rao Comments on Congress Govt : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు ఆర్నెళ్లలోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే పట్టభద్రులు గులాబీ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. ఆర్నెళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి హామీలను తుంగలో తొక్కారని ఆక్షేపించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని హరీశ్‌రావు ఆరోపించారు.
"ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మోసాలన్నీ బట్టబయలయ్యాయి. అందరినీ మోసం చేసింది. ఒక్క హామీ అయినా నెరవేర్చిందా మీరే ఆలోచన చేయండి. ఆరింటిలో అయిదు హామీలు అయ్యాయట, కాంగ్రెస్ పార్టీ అమలు చేయనందుకే ఈ ఎన్నికల్లో ఓడగొట్టి వాళ్ల కళ్లు తెరిపించాల్సిన బాధ్యత ఇవాళ మీ అందరిపై ఉంది."- హరీశ్‌రావు , మాజీమంత్రి
హామీలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పాలి : ప్రజా పక్షాన నిరంతరం పోరాడే బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో హామీలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పాలని కోరారు. ఆర్ఆర్ టాక్స్ పేరుతో తెలంగాణలో డబ్బులు వసూలు చేసి దిల్లీకి తరలిస్తున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు తెలిపారని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల నిరుద్యోగులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దక్కుతాయని విమర్శించారు.