Posters in Siddipet Demanding that Harish Rao Resign from MLA Post : సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ అయిందని, హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఫ్లెక్సీలు తీసేయడానికి అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఎలా? : 'నా అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనం. తాళాలు పగులగొట్టి, ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. దాడిని ఆపకుండా నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుంది. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే పౌరులకు భరోసా ఏది? దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలి.' అని హరీశ్‌రావు అన్నారు.
Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 17, 2024
The police, rather than intervening to prevent this… pic.twitter.com/uvSABsumQu
కేటీఆర్ ట్వీట్ : మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు. మరో ట్వీట్లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు అని, ప్రేమ బజార్లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని చురకలంటించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకునే వ్యక్తికి, ఇవి కనిపించడం లేదా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Hooligans associated with ruling Congress Vandalised Siddipet MLA @BRSHarish Garu’s official residence
— KTR (@KTRBRS) August 17, 2024
Telangana Congress has opened
" mohabbat ke baazaar me nafrat ka dookan"
is this what your mohabbat ka dookan all about mr @RahulGandhi ?
"The self proclaimed saviour of the… pic.twitter.com/sht2Ubi7hg
ఫినాయిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ శుభ్రం : ఘటనను నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ వినూత్నంగా నిరసనలు తెలిపింది. హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని ఫినాయిల్ పోస్తూ బ్రెష్‌తో నోరును శుభ్రం చేశారు. ఖమ్మం సభలో సీఎం చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావుకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని దమ్ముంటే హరీశ్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. లేకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని సూచించారు. ఈ విషయంపై ఇప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో తొలుత ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు.
'దమ్ముంటే రాజీనామాచెయ్' - హరీశ్‌రావుకు వ్యతిరేకంగా పోస్టర్లు - Posters against Harish Rao