BRS Leader Niranjan Reddy Comments on Runa Mafi : రూ.2 లక్షల రుణమాఫీ ఎవరికి చేస్తారో మండలాలు, గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల రుణాలు, రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న వారి వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని అడిగారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు ముందు కారు కూతలు కూసిన కాంగ్రెస్ నేతలు, నేడు కోతలు విధిస్తున్నారని, ఏప్రిల్, మే నెల ఫించన్లు కూడా ఇవ్వలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సీజన్ ప్రారంభం అయినా రైతుభరోసా ఇవ్వడం లేదని, కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. మిగిలిన రుణమాఫీ అంతా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.4,000 కోట్ల రుణాల మాఫీ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అడిగారు. ఎన్నికల నాటికి మిగిలిన రుణమాఫీ ఇస్తారా ఇవ్వరా చెప్పాలని ప్రశ్నించారు.
ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు మించి రుణాలు ఇవ్వరని, ఐదెకరాలలోపు ఉండి రూ.2 లక్షలు ఎంతమంది రుణం తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిరంజన్ రెడ్డి అడిగారు. బోనస్ బోగస్ అని అందరికీ అర్థమైందని, కేసీఆర్ తరహాలో రైతుబంధు ఇచ్చినా మేలని రైతులు అంటున్నారని పేర్కొన్నారు. హేతుబద్దీకరించి అందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని అంటున్నారని, ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
రుణమాఫీ అమలు కాకుండానే పాలాభిషేకాలు : మహాలక్ష్మి సహా అన్ని హామీలను కుదించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏడు నెలలు గడిచినా రుణమాఫీ హామీ అమలు చేయకపోగా, కేబినెట్ నిర్ణయం కాగానే పాలాభిషేకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా వాళ్ల సోపతి ఎక్కువై సీఎం అలాగే చేస్తున్నట్లుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫలితం రాకుండానే సినిమా తరహాలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమలు కాకముందే పాలాభిషేకాలు చేయడం సిగ్గు అనిపించడం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
"నిరుద్యోగ యువతను దేశంలో గొప్పగా వంచించిన పార్టీ కాంగ్రెస్. 50 ఏళ్ల కింద దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఘనంగా సంబురాలు చేసుకోవాలి. దిల్లీలో ఉన్న సీఎం, పార్టీ అధిష్ఠానానికి చెప్పి చీకటి రాజ్యం నడిపించారని ఉత్సవాలు చేయాలి. హామీల అమలు, వైఫల్యాలను బాధ్యత కలిగిన మీడియా సంస్థలు ఎత్తి చూపాలి. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రో మోదీ, యాంటీ మోదీ పోరులో తటస్థంగా ఉన్న పార్టీలను ప్రజలు పరిగణనలోకి తీసుకోలేదు." - నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి