BRS Public Meeting at Karimnagar : అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా, మధ్యలో వచ్చినా బీఆర్ఎస్దే గెలుపునని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే తెలంగాణ అంతా తారుమారు అయిందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు.
గతంలో దళారులు లేకుండా వరి కొనుగోలు చేశామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. రంగు వచ్చిన ధాన్యం కూడా కొనుగోలు చేశామని గుర్తు చేశారు. హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని ధ్వజమెత్తారు. నాయకులు గెలుపు, ఓటములను పట్టించుకోకూడదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డానని స్పష్టం చేశారు.
నాలుగు నెలల్లో అంతా తారుమారు : రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని ఇంకా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందని చెప్పారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు చివర్లో వచ్చినా, మధ్యలో వచ్చినా బీఆర్ఎస్దే గెలుపునని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోనే తెలంగాణ అంతా తారుమారు అయిందని తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో కరెంటు కోతతో పసిపిల్లలు ఇబ్బందిపడుతున్నారనే వార్తలు వచ్చాయని మాజీ సీఎం కేసీఆర్ వివరించారు.
'హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లేటప్పుడు ఒకటే మాట చెప్పాను. ఆంధ్రప్రదేశ్ నుంచి దిల్లీ వెళుతున్నా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా అన్నాను. నాకెంత ఆత్మవిశ్వాసం ఉంటే చెబుతాను అర్థం చేసుకొండి. నేను అన్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో వెళ్లాను, తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో అహర్నిషలు కృషి చేశానని' మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
"బీఆర్ఎస్ హయాంతో పీఎం మోదీ కూడా అసూయ పడే పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగైదు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇంత తొందరగా వ్యవస్థ ట్రాక్ ఎందుకు తప్పింది. గోదావరి నీళ్లు కర్ణాటకకు ఇస్తా అన్నప్పుడు ముఖ్యమంత్రి చప్పుడు చేయడం లేదు. తెలంగాణలో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రంలో మన ఎంపీలను గెలిపించండి." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే - తెలంగాణ గెలుపు ఉంది : కేసీఆర్ - Ex CM KCR Election Campaign