Bribe for AP CM Chandrababu Naidu House Permission : చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది.
సంపద సృష్టిస్తాం - పెంచిన ఆదాయం పంచుతాం : చంద్రబాబు - AP CM CBN on Wealth Creating
డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్ : గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ.లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.