Bhatti Vikramarka Fires On BJP : రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ నేతలు 400 సీట్లు కోరుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని, వాటి ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయని చెప్పారు. సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతోందని, జనాభా దామాషా ప్రకారం ప్రజలు వనరులు పొందలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి అని తెలిపారు.
Bhatti Slams BJP Over Reservations Issue : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం వనరులు సమానంగా పంచుతామన్న ఆయన కులగణన చేపడతామని రాహుల్ చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణనపై విధాన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి కాంగ్రెస్ పునాదులే కారణమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా బలహీనవర్గాలు పోరాటం చేయాలని కోరారు.
"ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. దేశంలో 90 శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు బీజేపీ కుట్ర. హక్కులు కాపాడుకునేందుకు ఓటు ద్వారా కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలి. బీజేపీకి ఓటు వేస్తే ప్రజలకు భవిష్యత్తు లేకుండా పోతుంది. బీజేపీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. దేశం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నటిస్తోంది. దేశ సంపదను కొందరికి కట్టబెడుతూ ప్రజలను బానిసలుగా చేసేందుకు యత్నం." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వంలో కావాల్సినంత కరెంటు ఉందని, ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చినా విద్యుత్ శాఖ ఉద్యోగులు సమర్ధంగా విధులు నిర్వహిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని వెల్లడించారు. అందువల్ల విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 52.9శాతం డిమాండ్ అండ్ సప్లై పెరిగిందని పేర్కొన్నారు.
Bhatti Slams Ex CM KCR : బీఆర్ఎస్ హయాంలో రైతులు రోడ్డ మీదకు వచ్చి ధర్నాలు చేసిన రోజులు మర్చిపోయారా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను భట్టి ప్రశ్నించారు. అప్పట్లో విద్యుత్ శాఖ పట్ల బీఆర్ఎస్ అనుసరించిన తీరును సాక్షాత్తు అప్పటి ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు మీడియా ముఖంగా ఎండగట్టిన విషయం మర్చిపోయారా అంటూ నిలదీశారు. తొమ్మిది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ విద్యుత్ పట్ల చేస్తున్న దుష్ప్రచారం చాలా హేయకరమైనదని విమర్శించారు.