Bhatti Participated in YSR Birth Anniversary Celebrations : రాష్ట్రంలో రాబోయే 2 దశాబ్దాలు కాంగ్రెస్‌దే అధికారమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారంతా ప్రజా పాలనను చూసి మళ్లీ పార్టీలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ అభిమానులంతా కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామని వెల్లడించారు.
గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి, వైఎస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలకు వైఎస్సార్ దేవుడయ్యారని భట్టి తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా మేమున్నామంటూ పేదలకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర అన్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, దానిని అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలకు వైఎస్సార్ దేవుడయ్యారు. ఆరోగ్య శ్రీ ద్వారా మేమున్నామంటూ పేదలకు భరోసా ఇచ్చారు. వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తాం. రాష్ట్రంలో రాబోయే 2 దశాబ్దాలు కాంగ్రెస్‌దే అధికారం. - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
సీఎం సహా ప్రముఖుల నివాళులు : అంతకుముందు బంజారాహిల్స్ సర్కిల్‌లోని వై.ఎస్.ఆర్ విగ్రహం వద్ద భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రావులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పంజాగుట్టలోని దివంగత వై.ఎస్.ఆర్. విగ్రహం వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి మహాత్మా జ్యోతి రావు పూలే భవన్‌లో రాజశేఖర్ రెడ్డి ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అక్కడి నుంచి గాంధీభవన్ చేరుకుని వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు.
వైఎస్సార్ ఎప్పుడూ జీవించే ఉంటారు : ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన మహనీయుడని కొనియాడిన మంత్రి, పేదల జీవితాల్లో వైఎస్సార్ ఎల్లప్పుడూ జీవించే ఉంటారన్నారు.