Deputy CM Bhatti Vikramarka Meet CMP Leaders : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొని, ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సీపీఎం కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లారు. ఆయనకు సీపీఎం నాయకులు స్వాగతం పలికారు.
ఈక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, సార్వత్రిక ఎన్నికల్లో హస్తానికి మద్దుతు ఇవ్వాలని సీపీఎం నేతలకు విజ్ఞప్తి చేశారు. కాగా ఇండియా కూటమిలో మిత్ర పక్షంగా సీపీఎం పార్టీ ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆ పార్టీ మద్దతు అడిగేందుకు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం శ్రేణులను కలిసేందుకు వచ్చినట్లు భట్టి వివరించారు. గత అసెంబ్లీ ఎలక్షన్లో కలిసి పని చేయాలని భావించినప్పటికీ, కుదుర లేదన్న ఆయన, భవిష్యత్లో తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.
Congress Party Wants to Alliance With CPM : ఆ పార్టీ మద్దతు తమకే ఉంటుందని అశాభావం వ్యక్తం చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు ఎస్. వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలు గానూ, 15 మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది.
అందులో భాగంగానే మిత్ర పక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంగా కమ్యుూనిస్టుల పొత్తు కోరుతుంది. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం పార్టీలు కలిసి ప్రయాణించాలని అంగీకారానికి వచ్చినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు గెలవకుండా కాంగ్రెస్, సీపీఎం పార్టీలు కలిసి పోరాటం చేయనున్నాయని వివరించారు.