Congress Special Manifesto in Telangana 2024 : తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Telangana Congress Manifesto 2024 : రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారు చేశామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీని తయారీకి ఎంతో కసరత్తు చేశామని చెప్పారు. తమ పార్టీ నాయకులతోనే కాక వివిధ సంఘాలతో మాట్లాడామని అన్నారు. తెలంగాణ సమాజానికి మేలు చేసే ప్రతి ఒక్క అంశాన్నీ ఇందులో ఉంచామని వివరించారు. మేనిఫెస్టోలో కీలకమైన 23 అంశాలను ఉంచినట్లు, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేలా దీనిని రూపొందించామని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం
- రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
- రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైను ఏర్పాటు
- రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు
- యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీల ఏర్పాటు
- అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు
- మేడారం జాతరకు జాతీయ హోదా
- గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తాం
- భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం
- 4 సైనిక పాఠశాలలు ఏర్పాటు
- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు
- కేంద్ర నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందేలా చర్యలు
- సౌరశక్తి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాం
- సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు
- ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం
- పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా
- నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతాం
పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీ : పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలో భాగంగా మేనిఫెస్టో తయారుచేశామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గడప గడపకూ మేనిఫెస్టోను తీసుకెళ్లాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.
అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు : అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. ఈ కమిటీలో ఉన్న అందరికీ అభినందనలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని, ఆ పార్టీ నేతల నినాదాలు చూసి ప్రజలు భయపడుతున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో విపక్ష నేతలు ఆందోళనకు గురవుతున్నారని విమర్శించారు. దేశ ప్రజలకు న్యాయం జరగాలనే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. దేశం బాగుండాలంటే రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారని దీపాదాస్ మున్షీ వెల్లడించారు.
యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటివరకు ఐదు గ్యారంటీలు అమలు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి అన్నిరకాలుగా మేలు చేసేలా మేనిఫెస్టో ఉందని అజారుద్దీన్ తెలిపారు. అన్నివర్గాల ప్రజలకు లబ్ధి జరిగేలా దీనిని తయారు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మరో 8 రోజులపాటు కష్టపడి ప్రచారం చేయాలన్నారు. ఈ మేనిఫెస్టో రాష్ట్రానికి బంగారు భవిష్యత్‌ను ఇస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. దీనిని ప్రతి గడప దగ్గరికీ తీసుకెళ్లాలని నేతలు పిలుపినిచ్చారు.