Congress Leaders Counter to Harish Rao Challenge : లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం మండు వేసవిని మించి భగ్గుమంటోంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు మంటలు రేపుతున్నాయి. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారి తీసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఇవాళ హరీశ్ రావు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి మరోసారి ఛాలెంజ్ చేశారు.
హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి మలినం చేశారని, పసుపు నీళ్లతో ఆ మలినాన్ని శుద్ధి చేసినట్లు ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.హరీశ్‌రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హరీశ్‌రావు రాజీనామా విషయంలో తాను బాధ్యత తీసుకొని రాజీనామా ఆమోదించేలా చేస్తానని వెంకట్ స్పష్టం చేశారు.
ఛాలెంజ్ యాక్సెప్టెడ్ - ఆ హామీలన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా - మళ్లీ పోటీ చేయను : హరీశ్ రావు
"అమరవీరుల స్తూపాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు అపవిత్రం చేశారని పసుపు నీళ్లతో శుద్ధి చేశాం. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని సీఎం మాటిచ్చారు. హరీశ్‌రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారు. ఆగస్టు 15లోగా ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తాం. నేను బాధ్యత తీసుకుని హరీశ్‌రావు రాజీనామా ఆమోదించేలా చూస్తాను." - బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ
మరోవైపు హరీశ్ రావు ఛాలెంజ్ స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అందుకు తగ్గట్లుగానే మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామా లేఖతో గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. తాను మాటకు కట్టుబడి ఉన్నానని పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేసేందుకు సీఎం గన్‌పార్కు వద్దకు రావాలని కోరారు. ఇదిలా ఉండగా హరీశ్‌రావు రాజీనామా సవాల్‌పై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భగ్గుమన్నారు. బీఆర్ఎస్ నేత రాజీనామా డ్రామాతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇలా మాటల తూటాలతో రాష్ట్ర రాజకీయం వేసవిలో కూడా మండుటెండలా భగ్గుమంటుంది.