CM Revanth Reddy Met UPSC Candidates : నిరుద్యోగుల సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినట్లు వెల్లడించారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయమందిస్తామని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుని గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు.
అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 41 మందికి లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. నిరుద్యోగ యువతకు మేమున్నామనే మనోధైర్యం కల్పించేందుకే మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నట్లు సీఎం వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్ని భర్తీ చేస్తామని హమీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు ఇస్తున్నామన్న ఆయన, ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామని వివరించారు. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించారని తెలిపారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్ సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్ సాధించి రాష్ట్రానికే రావాలని అభ్యర్థులను కోరారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణవారైతే రాష్ట్రానికి ఇంకా మంచి జరుగుతుందన్నారు.
"పరీక్షలు మాటిమాటికి వాయిదా పడడం మంచిది కాదు. అభ్యర్థుల సమస్యలను అర్ధం చేసుకుని గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశాం. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. దురదృష్టవశాత్తూ కొన్నేళ్లుగా తెలంగాణలో యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేదనికంటే పరీక్షల్లో జరిగే నిర్వహణ లోపాలపై కొట్లాడేందుకే వారి సమయం వృధా అయ్యింది." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
సింగరేణి సంస్థ సహకారంతో 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉద్యోగ నియామకాల కోసమే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా ఆయన విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు వివరించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు. నిరుద్యోగుల బాధలు తనకు తెలుసన్న సీఎం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చామని పేర్కొన్నారు.
యూపీఎస్సీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా వాటిపై ఆరోపణలు, నిర్వహణ లోపాలు ఏమీ లేవని అందుకే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక యూపీఎస్సీ చైర్మన్‌ను కలిశారని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి, యూపీఎస్సీ తరహాలు కొన్ని మార్పులు చేసి వెంటవెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు వివరించారు.