CM Revanth Reddy Chitchat with Media : ఖమ్మంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలపై మాట్లాడారు.
75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ. వర్షం పడిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ముందు చూపు వల్లే ప్రాణనష్టం తగ్గిందని తెలిపారు. వరదలపై హరీశ్‌రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఆయన ముందుగా బీఆర్ఎస్ నేత పువ్వాడ ఆక్రమణలపై స్పందించాలని కోరారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి కట్టారని, ఆ ఆక్రమణలను తొలగించాలని పువ్వాడకు హరీశ్‌రావు చెప్పాలని అన్నారు. ఆక్రమణల తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ : వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్రాన్ని రూ.2 వేల కోట్ల తక్షణ సాయం కోరామని తెలిపారు. అలాగే ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశానని వెల్లడించారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని, ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని వివరించారు.
రాష్ట్రంలో వరద నష్టంపై ప్రాథమిక అంచనాను కేంద్రానికి నివేదించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం అందిస్తామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం చేస్తామని మాటిచ్చారు. మంత్రులంతా వరద సహాయక చర్యల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.