CM Revanth Reddy At Karimnagar Jana Jatara Sabha : దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతోనే బీజేపీ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మికుంట కాంగ్రెస్ జన జాతర సభలో మాట్లాడిన సీఎం, ఈ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. అందుకోసమే 400 స్థానాల్లో గెలిపించాలని బీజేపీ అడుగుతుందని, మళ్లీ గెలిస్తే మాత్రం రిజర్వేషన్లు రద్దు అవుతాయని దుయ్యబట్టారు.
బీజేపీతో తాను పొత్తు పెట్టుకున్నానని కేసీఆర్ చెబుతుండటం హాస్యాస్పదమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కమలం, గులాబీ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక భూమిక పోషించారన్న ఆయన, ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు అండగా ఉన్నారన్నారు. కానీ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ జిల్లాకు ఏమి చేయలేదని ఆక్షేపించారు.
"పార్లమెంట్‌లో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధాని 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను అవమానించే విధంగా పార్లమెంట్‌లో మాట్లాడారు. తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, రాష్ట్ర ప్రక్రియను తప్పు పడుతుంటే ఇక్కడ ఎంపీ బండి సంజయ్ మౌనంగా ఉన్నారు." -రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Reddy Comments on PM Modi : మెున్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్‌ను తలపిస్తే, అందులో కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని అదే స్ఫూర్తితో ఫైనల్స్‌లో మోదీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌కు తెచ్చింది ఏం లేదని, పదేళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చింది శూన్యమని, గాడిద గుడ్డు ఇచ్చారని వ్యంగ్యస్త్రాలు సీఎం సంధించారు. తెలంగాణను పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అవమానించారన్న రేవంత్, ఆ సమయంలో బండి సంజయ్ సభలోనే ఉన్నారని పేర్కొన్నారు.
మోదీ కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో తెలంగాణను బీజేపీ వంచిస్తోందని ధ్వజమెత్తారు. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితికి కాషాయం వచ్చిందన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీ రాముడిని కూడా వదల్లేదన్నారు. మనం హిందువులం కాదా? బతుకమ్మ ఆడట్లేదా, దసరా, దీపావళి జరుపుకోవట్లేదా అని ప్రశ్నించిన సీఎం, మన కంటే నిఖార్సైన హిందువులు ఎవరైనా ఉన్నారా అని అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని తెలిపారు.