Rajiv Gandhi Birth Anniversary Celebrations : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమాజిగూడ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, ఇతర కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేసింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది ఆయనే అని గుర్తు చేశారు. సమూల మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి రాజీవ్‌గాంధీ నాంది పలికారన్న ముఖ్యమంత్రి, కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగాలు వస్తాయని నాడు చెప్పారని, టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని, దేశ యువతకు ఆయన స్ఫూర్తినిచ్చారన్నారు.
Rajeev Gandhi Death Anniversary Celebrations : రాజీవ్‌గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
సమూల మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి రాజీవ్ గాంధీ నాంది పలికారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారు. బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా పొగరు తగ్గలేదు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని అంటున్నారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్‌ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుంది. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఏది పడితే అది మాట్లాడితే బహిష్కరణే : ఇదే సమయంలో అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి రావడం బీఆర్‌ఎస్‌కు ఇక కలేనన్న ఆయన, చేతనైతే ఎవరైనా విగ్రహం మీద చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా, పొగరు తగ్గలేదని ధ్వజమెత్తారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వీళ్లు, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదన్న సీఎం, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించనవసరం లేదని స్పష్టం చేశారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే, తెలంగాణ సమాజం సామాజిక బహిష్కరణ చేస్తుందని బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు.