CM Revanth Reacts on BJP Manifesto : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 'విఫలమైన బ్యాంకులో డ్రా చేసిన పోస్ట్ డేటెడ్ చెక్'గా మేనిఫెస్టో ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2004లో షైన్ ఇండియానే ఇప్పుడు వికసిత్ భారత్‌గా తీసుకువస్తున్నారన్నారు. అయితే అప్పుడు ప్రజలు సోనియాగాంధీ(Sonia Gandhi) నాయకత్వంలో తిరస్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రెండు దఫాల్లో విఫలమైన బీజేపీని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కాంగ్రెస్ ప్రజల కష్టాలను తీరుస్తుందని రేవంత్ పేర్కొన్నారు.
2004 చరిత్ర పునరావృతమవుతుంది : దేశంలో 20 ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి(India Alliance) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకు ఇచ్చిన చెక్కులా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
"2004లో షైన్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ, ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసింది. అప్పుడు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న కమలం పాలనను సోనియాగాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితి పునరావృతమవుతుంది. అప్పటి లాగే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న కాషాయ పార్టీని తిరస్కరించి, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను గెలిపిస్తారు. అప్పుడే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా చూస్తున్నారు."- రేవంత్ ట్వీట్
AICC President Kharge on BJP Manifesto : బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను తప్పుడు హామీల పత్రంగా కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. గతంలో ఇచ్చిన హామీలనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్(BJP Govt) నెరవేర్చలేకపోయిందని ఆరోపించింది. తాజాగా ‘సంకల్ప పత్ర’లో పేర్కొన్న గ్యారంటీలన్నీ ప్రధాని తప్పుడు హామీలకు వారెంటీలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు.