CM Revanth Fire on KCR : మూడు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని సీఎం(CM Revanth Reddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన 'తెలంగాణ పునర్నిర్మాణ సభ' వేదికగా రేవంత్ రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉందన్న సీఎం, ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉందని పలికారు. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలన్నారు. ఆయన పోరాట స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకున్నట్లు వివరించారు. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్(KCR) పాలనను అంతం చేశామని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించామని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు.
CM Revanth Reddy Sabha in Indravelli : గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్‌కు రాదన్నారు. అన్ని వర్గాలను కేసీఆర్ నట్టేట ముంచారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం నాడు ప్రగతిభవన్ వద్దకు గద్దర్ వెళ్తే, గేటు బయట నిలబెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు, గద్దర్ ఉసురు తగిలిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
ఈ దేశంలో ఉన్నది, ఉండేది రెండే కూటములని అందులో ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి(India Alliance) అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మోదీ దగ్గర తాకట్టుపెట్టి కేసీఆర్ గులాంగిరి చేస్తారని విమర్శించారు. రైతుల ఆదాయ రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మతం పేరుతో ఒకరు, మద్యం పేరుతో మరొకరు ఓట్లు అడిగేందుకు వస్తారని, ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఎం కోరారు.
పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, ఏనాడైనా ఈ అడవి బిడ్డలు గురించి ఒక్కరోజైనా ఆలోచన చేశారా? మీ దుర్మార్గమైన పాలనలో మీ కుటుంబం, మీ పార్టీ వాళ్లు ఈ తెలంగాణ రాష్ట్రంపై పడి దోచుకుని తిని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పగించారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన మీరు ఒక్కరోజైనా మీరు ఆదిలాబాద్ బిడ్డలు కోసం సమీక్ష చేశారా? మీ శాపనార్థాలకు భయపడేది లేదు. మూడు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారు, మా ప్రభుత్వాన్ని పడగొడుతామంటున్నారు. ఎవరికీ దమ్ము లేదు. ప్రజలే మా బలం, వారు చూస్తూ ఊరుకోరు.:-రేవంత్ రెడ్డి, సీఎం
15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడే బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) శాపనార్థాలు పెడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్‌కు, గద్దర్ ఉసురు తగిలిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, రూ.కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేనిది, మేము 2 నెలల్లో ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఏదేమైనా మేము అనుకున్న సమయానికి అనుకున్న విధంగా హామీల అమలును పూర్తి చేసి తీరుతామన్నారు.
రాబోవు 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తమదని పేర్కొన్నారు. త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టే బాధ్యత, కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత తమదేనని సీఎం స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలను కోరారు.
త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం