CM Revanth Election Campaign in Mahabubnagar : ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పార్లమెంటు ఎన్నికల్లో విజయం చాలా అవసరమని, ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన, ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం, రాష్ట్రానికి ప్రకటించిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని, ఉత్తరాదికి తరలించుకుపోయారని ధ్వజమెత్తారు.
Revanth Reddy Fires on BJP : మానుకోట కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోటేనన్న సీఎం, ఎంపీ ఎన్నికల్లోనూ సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని వివరించారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు బండకేసి కొట్టారన్న ఆయన, రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని కూడా గద్దె దించాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీకి దిల్లీలో మోదీ సహకరించారని ఆరోపించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగినా ప్రధాని చూస్తూ కూర్చున్నారని ధ్వజమెత్తారు.
"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి, స్టేట్‌కు రావల్సిన నిధులను ఇవ్వకుండా అవమానించి అభివృద్ధిని అడ్డుకున్న మీరు(బీజేపీ) ఇవాళ ఓట్లు, సీట్లు కావాలని అడుగుతున్నారంటే ఎంత ధైర్యం. కుంభమేళా కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న మీరు, మా మేడారం జాతరకు మూడు కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లు వేయాలా? ఇవాళ మోదీ, కేడీ ఒక్కటై, ప్రత్యక్షంగా కొట్లాడితే ఓట్లు రావని, కుమార్తె బెయిల్ కోసం చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు."-రేవంత్‌రెడ్డి, సీఎం
అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ప్రకటించిందని గుర్తుచేసిన రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఏర్పాటును ప్రధాని ఎన్నోసార్లు అవమానించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చెల్లదని పార్లమెంట్ సాక్షిగా అన్నారన్న ఆయన, రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన కాషాయ దళానికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కుంభమేళాకు రూ.వేల కోట్లు ఖర్చు చేసిన మోదీ సర్కార్, మేడారం జాతరకు రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆక్షేపించారు.
పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది : కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనలేక, బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కుమార్తె కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చేతులు కలిపారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని రేవంత్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ, ఖర్చులు మాత్రమే రెట్టింపు చేశారని సీఎం విమర్శించారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మానుకోట వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటానికి అల్లాటప్పాగా రాలేదన్న రేవంత్‌రెడ్డి, పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు.