BRS MLC Naveen Rao On Phone Tapping Allegations : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై కావాలని, పని గట్టుకుని మరీ బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు అన్నారు. ఈ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్న ఆయన, ఎవరు పిలిచినా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రణీత్ రావు, శ్రవణ్ రావులతో తనకు కనీస పరిచయాలు కూడా లేవని, ఏనాడూ వారితో ఫోన్లో మాట్లాడిన సందర్భాలు కూడా లేవని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర అధికారులను కూడా ఏదైనా కార్యక్రమాల్లో లేదా తాము నివసించే ప్రాంతంలో గతంలో పని చేసిన అధికారులను మర్యాద పూర్వకంగా మాట్లాడటమే తప్ప, ఎలాంటి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోలేదని నవీన్ రావు వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదని, అవాస్తవాలతో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా దురుద్దేశంతో కొంత మంది తన పేరు ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే మరోమారు తన పేరు తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక, లోతైన దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుసుకోవాలని దర్యాప్తు అధికారులను కోరిన నవీన్ రావు, మీడియా కూడా వాస్తవాలు తెలుసుకొని రాయాలని అన్నారు. ఏవైనా ఆరోపణలు వస్తే తన వివరణ కూడా తీసుకోవాలని కోరారు.
Phone Tapping Case Updates : ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావుతో పాటు నవీన్‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు - బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు