BRS MLAs Meet Former CM KCR at Erravalli Farmhouse : కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని గులాబీ దళపతి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కేసీఆర్‌ను కలిశారు. తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారితో సుధీర్ఘంగా చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, క్షేత్రస్థాయి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, ప్రజల సమస్యలు తదితర అంశాల గురించి భేటీలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ నుంచి నేతల వలసల గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాడు వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్నో జరిగాయని, అయినా భయపడలేదని అన్నట్లు సమాచారం. కొంత మంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడినా ఆ ప్రభావం పెద్దగా ఉండబోదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరచూ కలుస్తానని చెప్పారు.
పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారికి ఎన్నో అవకాశాలు, గౌరవం ఇస్తే పార్టీ మారుతున్నారని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని నేతలతో అధినేత అన్నట్లు సమాచారం. అటువంటి వాటి వల్ల పార్టీకి నష్టం జరగదని ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు మంచి రోజులు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలకు సూచించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద్, గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ షేరి సుభాశ్ రెడ్డిలతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరందరికీ మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని ఎమ్మెల్యేలతో చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌కు బీఆర్ఎస్ నిర్ణయం : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయనుంది. సభాపతి ప్రసాద్‌కుమార్‌ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు.