BRS MLAs Join to Congress in Telangana : అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. వివిధ స్థాయిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా పని చేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వీడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వలసలు జోరుగా సాగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో పార్టీ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని, పలువురు శాసనసభ్యులు కారు దిగుతారని చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలబోరంటూ కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారంను అనుసరిస్తూ జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కూడా గులాబీ కండువాను పక్కన పెట్టి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. దీంతో ఇప్పటి వరకు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినట్లయింది.
39 నుంచి 33కు : ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున మొత్తం 39 మంది గెలుపొందగా, లాస్య నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. 38 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. దీంతో శాసనసభలో బీఆర్ఎస్ బలం 33కు పడిపోయింది. ఇంకా కొనసాగుతున్న వలసలు గులాబీ పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి.
ఆలోపు కాంగ్రెస్లోకి 20 మంది ఎమ్మెల్యేలు : కాంగ్రెస్ నేతలు సైతం మరింత మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడతారని పదే పదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారని చర్చ జోరుగా సాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తాము పార్టీని వీడబోమని చెబుతున్నారు. కొందరు శాసనసభ్యులు, వారి పరిధిలోని ముఖ్య నేతలు పార్టీ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలను కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 20కు చేరుకునే అవకాశం ఉంటుందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.