Tension at Gandhi Hospital : నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారం రోజులుగా దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు విద్యార్థులు, నేతలు రావటంతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన విద్యార్థులు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
గ్రూప్ -2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగ సమస్యలపై ఉద్యమిస్తున్న నిరుద్యోగ ఐకాస నేత మోతీలాల్ నాయక్ దీక్షకు మద్దతు పెరుగుతోంది. సంఘీభావం తెలిపేందుకు వస్తున్న విద్యార్థులు, నేతలతో గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. మోతీలాల్ నిరాహార దీక్షకు మద్దతుగా గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్వీ నాయకులతో పాటు ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదే సమయంలో మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు వచ్చిన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోతీలాల్ నాయక్, లాఠీఛార్జ్‌లో గాయపడిన నిరుద్యోగుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ యువ మోర్చా కార్యకర్తలను పోలీసులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యువ మోర్చా కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మోతీలాల్ నాయక్ దీక్షకు మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్ట్స్ కళాశాల వద్ద బైఠాయించిన విద్యార్థులు, మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
'ఇదేనా మీ ప్రజా పాలన?' : ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నేతలకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్, విద్యార్థి నాయకుల అరెస్టును ఆయన ఖండించారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా, పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ఇదేనా మీ ప్రజా పాలన అని ప్రశ్నించారు.