BRS MLA Padi Kaushik Reddy Sensational Comments : ఫోన్ ట్యాపింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమ వ్యక్తి గత సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడిగారు. కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. మానుకొండూరు సీఐకి కాన్ఫరెన్స్ పెట్టడం లేదని మంత్రి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసునని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ ఎందుకు స్పందించలేదు : కేవలం 40 శాతం మందికే రుణాలు మాఫీ అయ్యాయని మిగిలిన వారికి అవ్వలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలకు హక్కు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీవి కావని అవి ప్రజల సొమ్మునని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థి చెక్కులు పంచుతున్నారని వివరించారు. దీనిపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. సీపీ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు.
'నా ఫోన్‌ను ఈ ప్రభుత్వం కచ్చితంగా ట్యాపింగ్ చేస్తోంది. నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడినా ఏం చేస్తున్నా వాళ్లకు తెలుస్తోంది. మా పర్సనల్ విషయాలు వాళ్లకు ఎలా వెళుతున్నాయని నేను అడుగుతున్నా. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని నేను అనుమానిస్తున్నా'- పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే