BRS MLA Kaushik Reddy Comments On CM Revanth : రాజకీయ కుట్రతోనే రేవంత్ సర్కార్ ప్రాంతీయ బేధాలకు తెరలేపుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆక్షేపించారు. ఆంధ్రా సెటిలర్లు అంటే తనకు గౌరవం ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, రాష్ట్ర రాజధాని అభివృద్ధి కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పదేళ్ల కాలంలో ఒక్క ఆంధ్రా వారికైనా ఏమైనా ఇబ్బంది జరిగిందా అని ప్రశ్నించిన ఆయన, కేసీఆర్ బాటలో తాము నడుస్తామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి నిర్బందించారని, గురువారం పోలీసులు దగ్గరుండి గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి తనను చంపించే ప్రయత్నం చేశారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. తనను హత్య చేయాలని స్వయంగా రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఈ విషయంలో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సమాజానికి పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారు : గాంధీతో పాటు 30 మంది గూండాలను సైబరాబాద్ పోలీసులు ఆపలేకపోయారా అని ప్రశ్నించిన ఆయన, ఎమ్మెల్యే గాంధీ మాట్లాడిన భాషను శేరిలింగంపల్లి ప్రజలు, తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రజలు గాంధీకి ఓటు వేశారా అని అడిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే గాంధీ పార్టీ కండువా కప్పుకోవాలని అన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ఒక కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు ట్రాప్‌లో పడి అందరినీ అమరావతి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌ను ఎంత దెబ్బ తీస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అంతా కేసీఆర్ శిష్యుడు కౌశిక్‌రెడ్డి స్థాయికి దిగజారారని.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అంత స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. ఇక నుంచి రేవంత్‌రెడ్డి వర్సెస్ కౌశిక్‌రెడ్డి అని అన్నారు. తనను చంపినా తెలంగాణ ప్రజల కోసం సిద్ధమే అన్న ఆయన, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగిరేవరకు పోరాడుతూనే ఉంటానని తెలిపారు. కేసీఆర్, తెలంగాణ లేకపోయి ఉంటే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు కాక తప్పదు : రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ భిక్ష అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అందరూ వారి గూండాయిజం, రౌడీయిజాన్ని చూశారని, తెలంగాణ ప్రజలు మీపై ఎలా తిరగబడుతున్నారో గమనించాలని సూచించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు ఊర్లలో తిరగలేరని అన్నారు. పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తప్పవని, మారిన ఎమ్మెల్యేలు మాజీలు కాక తప్పదని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్ష ఎమ్మెల్యే పదవులని, దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
"ఆంధ్రా సెటిలర్లు అంటే నాకు గౌరవం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రతీ సెటిలర్కు నేను చెబుతున్నాను, గురువారం నేను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అరెకపూడి గాంధీని మాత్రమే అన్నాను. వీళ్ల చిల్లర రాజకీయాలు కోసం ఆంధ్రా, తెలంగాణ అని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారు. ఇదంతా పెద్ద కుట్ర, దయచేసి హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా గమనించాలి." - పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే