BRS on Lok Sabha Election Polling in Telangana : లోక్‌సభ ఎన్నికలు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి సంకటంగా నిలిచాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే వచ్చిన పార్లమెంటు ఎన్నికలు కఠిన సవాల్‌ను విసిరాయి. నేతల వలసలు కూడా గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార పంథాను మార్చి బస్సు యాత్రను చేపట్టారు. రాష్ట్రంలో 12 నియోజకవర్గాల్లో 17 రోజుల పాటు బస్సుయాత్ర, రోడ్ షో నిర్వహించి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. పదేళ్ల పాలనలో చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమల్లో వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ గొంతుకగా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కోరారు.
Telangana Lok Sabha Polls 2024 : పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం వివిధ నియోజకవర్గాలు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో కీలక నేత హరీశ్‌రావు మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించారు. మెరుగైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు వస్తాయని కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ధైర్యంగా పని చేసిన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి వీర సైనికులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పుంజుకోవడం ఆషామాషీ కాదు : పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషీ వ్యవహారం కాదని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ వాసులు బీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో అండగా నిలిచారన్నారు. కార్యకర్తల కృషి వల్ల బీఆర్ఎస్ గొప్ప ఫలితాలు సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 64.93 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో మాత్రం అత్యల్పంగా పోలింగ్ నమోదు అయింది.
కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది : కేటీఆర్ - KTR Comments on Congress Party