BRS Leaders Not Interested in Hyderabad Election Campaign : భారత్ రాష్ట్ర సమితి కీలక నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోవడంతో నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా, ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పరిణామాలన్నీ బీఆర్‌ఎస్ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారాయి.
Lok Sabha Elections 2024 : మరోవైపు హైదరాబాద్ పరిధిలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో బలమైన నాయకులున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. ఈ నేతలు, శ్రేణులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి నగరంలో అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. అదే కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉండిపోయారు.
BRS Focus on Strengthening Party : పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా, నియోజకవర్గ స్థాయి నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, క్షేత్ర స్థాయిలో శ్రేణులు ముందుకు కదలడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తూతూమంత్రంగా పని చేస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు ఒకవైపు ఆందోళన, మరోవైపు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి వలసలకు కట్టడి చేస్తూనే, కార్యకర్తలను నడిపించడానికి అగ్ర నాయకత్వం కష్టపడాల్సి వస్తోంది.
మెజార్టీ ఎమ్మెల్యేలున్నా : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలో మాత్రం ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. మొత్తం 29 నియోజకవర్గాలకు 18 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా, హస్తం పార్టీ మూడింటికే పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఈ ఎన్నికల్లో పని చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదనే భావన చాలామందిలో ఉండిపోయింది. నగరంలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అభ్యర్థుల విజయానికి వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం ఆసక్తి చూపడం లేదు.
కార్పొరేటర్లదీ ఇదే తీరు : బీఆర్ఎస్‌కు బల్దియాలో 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో సుమారు 30 మంది వరకు పార్టీ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కేవలం పదిమంది మాత్రమే తిరుగుతున్నారు. కొందరు కార్పొరేటర్లు పోలింగ్ తరువాత లేదా, అంతకుముందే హస్తం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల ముగ్గురు సిద్ధం కాగా, వారి పరిధిలోని ఎమ్మెల్యే ఆపారని గులాబీ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల తరువాత చూద్దామంటూ ఆపినట్లు తెలుస్తోంది.
మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో బీఆర్ఎస్ వీడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించరాదన్న భావన ఆ పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఇప్పుడు వెళ్లేవారు భవిష్యత్‌లో వెనక్కి వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదంటూ శ్రేణుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తూనే, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది.
నేటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర - మిర్యాలగూడ నుంచి ప్రారంభం - KCR BUS Yatra In Telangana