Satyavathi Rathod on MLC Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. కేసీఆర్, కేజ్రీవాల్‌లను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే సాక్షిగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా చేర్చారన్న ఆమె, కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆమె మాట్లాడారు.
దిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన భర్త అనిల్, కేటీఆర్, హరీశ్‌రావు
లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే భారతీయ జనతా పార్టీ కవితను ఈడీ ద్వారా అరెస్ట్ చేయించిందన్నారు. ఈ క్రమంలోనే అప్రూవర్లుగా మారి ఏది చెప్పినా చెల్లుతుందా అన్న సత్యవతి రాఠోడ్, మోదీకి డబ్బులు ఇచ్చామని ఎవరైనా చెబితే ఆయనను కూడా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కవిత పోరాట యోధురాలని, కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్, కేజ్రీవాల్‌లను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే సాక్షిగా ఉన్న కవిత పేరును నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమే. నిందితురాలు కాదు. కవిత పోరాట యోధురాలు. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు. - ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్
ఇది ఈడీ కేసు కాదు - మోదీ కేసు : మరోవైపు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ప్రధాని మోదీ తమ పార్టీపై ఎలా నిందలు వేస్తారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు. కేసీఆర్‌ను లొంగదీసుకునేందుకు ఆడబిడ్డ అని కూడా చూడకుండా కవితను మోదీ అరెస్టు చేయించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీలో నేరస్థులు చేరితే పరమ పవిత్రులు అవుతారా అని నిలదీశారు. కవిత రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అని రాజకీయ దురుద్దేశంతో ప్రస్తావించారని ఆక్షేపించిన సునీత, బీజేపీ దురుద్ధేశం లోకానికి తెలియడానికి ఈ ఒక్క అంశం చాలని వ్యాఖ్యానించారు. ఇది ఈడీ కేసు కాదని, మోదీ కేసు అని అన్నారు. మోదీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.