BRS Leader KTR on BJP Reservation Comments : రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని భారతీయ జనతా పార్టీ చెబుతోందని, వారి అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్‌కు 400 సీట్లు వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారని మండిపడ్డారు. వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమావేశానికి మాజీమంత్రి కేటీఆర్ హాజరై, ప్రసంగించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో చోటే భాయ్ మోసం చేస్తే, 2014లో బడా భాయ్ మోసం చేశారని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్లలో దేశ ప్రజలకు మోదీ తీరని ద్రోహం చేశారన్న ఆయన, మతం పేరుతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాళ్ల హామీలు పక్కకు పోయి, అన్నదాతల కష్టాలు మాత్రం రెట్టింపు అయ్యాయని విమర్శించారు.
"డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్నే రద్దు చేస్తాం, రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు మాట్లాడుతున్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా ఉంది ఈ గులాబీ జెండాకే."-కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
KTR Serious Comments on BJP : ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మోసం చేసిందని కేటీఆర్ తీవ్రంగా ద్వజమెత్తారు. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే రూ.15 లక్షలు జమ చేస్తామన్న వారి హామీ ఎంత మేరకు అమలు అయ్యందని ప్రశ్నించిన ఆయన, పదేళ్లలో దేశ ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అని అన్నారు. పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు సహా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ నిట్టూర్చారు.
అన్ని ధరలు పిరం చేసిన పిరమైన ప్రధాని - మోదీ : పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలోని సామాన్య ప్రజలకు నిత్యవసరాల కొనుగోలు ధరలు కొండెక్కాయని, అన్ని ధరలు పిరం చేసిన పిరమైన ప్రధాని నరేంద్ర మోదీనేనని కేటీఆర్ విమర్శించారు. మతం పేరుతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్కు కనీసం వంద మందికి పైగా నాయకులు ఉన్నారన్న మాజీమంత్రి, గ్రామాల్లో బీజేపీకి ఒకరిద్దరున్నాపెత్తనం చెలాయిస్తున్నారని తెలిపారు. ఒకరిద్దరు ఉన్న కమలం శ్రేణులపై గులాబీ పైచేయి ఎందుకు సాధించలేకపోతోందని ప్రశ్నించిన కేటీఆర్, మనలో మనకే ఓర్వలేని తనం ఎక్కువైందని, అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని మనమే ఓడించుకున్నామని గుర్తుచేశారు. ఇకపై ఆ ధోరణి మారాలని గెలుపు దిశగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.