Dubbaka MLA Kotha Prabhakar Reddy: ప్రజల చేత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను అవహేళన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ధోరణి అవలంభిస్తోందన్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే అధికారాలను కాలరాస్తోందని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి తనకు సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ ఈ విధంగా వ్యవహరించడం ఆప్రజాస్వామికమన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఆప్రజాస్వామిక విధానాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపేద ఆడపిల్లల కుటుంబాలకు చేయూతనందించే కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సైతం వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తనను కల్యాణ లక్ష్మి చెక్కులను సైతం పంపిణీ చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేయించారని ఆరోపించారు.
అన్నింటికి అడ్డంకులే: గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను మంజూరు చేసిన నిధులను రద్దు చేయించారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శిలాఫలకాలను ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో లేని ఎమ్మెల్యేల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు అభివృద్ధి పనుల సమీక్షపై పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెబితేనే అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆస్పత్రి, విద్య, విద్యుత్తు రంగాల అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
'ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, గత ప్రభుత్వంపై కక్ష సాధింపులను పక్కన పెట్టాలి. నియోజకవర్గ అభివృద్ధికి నయా పైసా లేదని అధికారులు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రజా సమస్యలపై రివ్యూ నిర్వహించేవారు. కానీ, ఈ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.'- కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధికి నయా పైసా లేదని అధికారులు చెబుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.
'గనుల వేలానికి పార్లమెంట్లో మద్దతు తెలిపిన బీఆర్ఎస్ - ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది' - BJP MP Raghunandan Rao comments