BRS EX Minister Niranjan Reddy Fires On Congress : ప్రభుత్వ వైఫల్యాలు తెరపైకి వచ్చినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంటూ లీకులు ఇస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అన్న ఆయన, ఉద్యమ సయయంలో కేసీఆర్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసినా సిల్లీ ఇష్యూగా పక్కన పెట్టామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ఇప్పటి వరకు మంత్రులు, పోలీసు అధికారులు ఎవరూ అధికారికంగా వివరాలు వెల్లడించలేదని, అయినా పోలీసు అధికారి, విచారణ అధికారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేరం మోపలేరని అన్నారు. అభియోగాలు ఎప్పుడూ చట్టపరిధిలో అంగీకరించవని పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెప్తారా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
"ఫోన్ ట్యాపింగ్ విషయాలన్నీ విచారణలో నిగ్గు తేలాల్సిన అంశాలు. అటువంటిది కోర్టులు లేకుండానే వారే ఆరోపణలు చేసి, వారే తీర్పు ఇచ్చేస్తారా? సీరియల్ మాదిరిగా రోజుకో లీక్ ఇచ్చి, కొనసాగించడం కూడా ఒక నేరమే. అంతేకాకుండా ఒకరు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా అభియోగం మోపడం సమంజసం కాదు. ఫోన్ ట్యాపింగ్ అంశం లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్."-నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
Niranjan Reddy Comments on CM Revanth : ప్రజలకు అన్నీ అర్థం అవుతాయని, ఏమైనా ఉంటే ఎదుర్కొంటామని తెలిపారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు లై డైరెక్టర్ పరీక్ష చేయాలని అంటున్నారని, లైవ్‌లో దొరికిన రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ వద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశగా వెళ్తుందో ఆర్నెళ్లలో ప్రజలకు అర్థమైందన్న ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హామీల అమలుపై చిత్తశుద్ది లేదని, ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగానే ఉందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చెప్పిన బోనస్ అనేది ఒక బోగస్ : గత ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను చిన్నగా చూపే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని, హాల్ సేల్‌గా ఎగ్గొట్టేలా మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. హామీలన్నీ అమలు చేస్తున్నట్లు రాహుల్ గాంధీచే కూడా అబద్ధాలు చెప్పించారన్న ఆయన, అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతులు తీవ్ర కోపంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన బోనస్, ఒక బోగస్ మాట అని, రైతులపై లాఠీ ఛార్జ్, అదనపు బోనస్ అని అన్నారు.
హైదరాబాద్ జంట జలాశయాలకు మల్లన్నసాగర్ నుంచి ఏడు టీఎంసీల నీరు తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారని, కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అయితే మల్లన్నసాగర్‌కు, అక్కడ్నుంచి హైదరాబాద్‌కు నీరు ఎలా తెస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు. రుణమాఫీ వాయిదాలు వేస్తున్నారని, ప్రజాపాలన కింద వచ్చిన లక్షలాది దరఖాస్తులు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. నిలకడ లేని, దుందుడుకు చర్యలు, మాటలతో ప్రభుత్వానికే నష్టమన్న నిరంజన్ రెడ్డి, నియంత్రించుకొని, నిగ్రహంతో మాట్లాడితేనే ముఖ్యమంత్రి పదవికి వన్నె వస్తుందని సూచించారు.