BRS Chief KCR Reaction on Delhi CM Kejriwal Arrest : మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌పై తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని అభివర్ణించారు. ఆయన అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించిన కేసీఆర్, ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పని చేస్తోందని ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటుందని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్- 'జైలు నుంచే పరిపాలన' - Kejriwal Arrested
కాంగ్రెస్ తీరు ఒకలా - రేవంత్ తీరు మరోలా : మరోవైపు మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్‌ది ఒకదారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మరోదారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆక్షేపించారు. బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి, ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పని చేయడం లేదన్న ఆయన, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ, మోదీకి అనుకూలంగా పని చేస్తున్నారని మరోసారి తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు.
'నా అరెస్టు చట్టవిరుద్ధం - రద్దు చేయండి' - సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్
మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుందని, లిక్కర్ స్కాం పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని తాము ఎప్పట్నుంచో చెబుతున్నామని, తమ ఆరోపణలను ఏఐసీసీ కూడా బలపరిచిందని హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఖర్గే, రాహుల్ ఆరోపించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదన్న హరీశ్‌రావు, ఆరెస్సెస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషని తాము ముందు నుంచీ చెప్తున్నామని, అది ఇప్పుడు నిజమని తేలిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఉన్న విషయాన్ని మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ