BJP in Telangana Lok Sabha Election 2024 : 2014లో ఒక ఎంపీ స్థానం! 2018లో నాలుగు ఎంపీ స్థానాలు! ప్రస్తుత లోక్‌సభ పోరులో 8 లోక్‌సభ స్థానాలు సాధించి తెలంగాణలో తన ప్రాభావాన్ని చూపించింది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. 2018లో ఒకే ఒక శాసనసభ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆ సంఖ్యను 8కు పెంచుకుంది. ప్రస్తుత లోక్‌సభ సమరంలోనూ అన్ని స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90 శాతం ఓట్లతో బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఆరు నెలలు తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకుని ఏకంగా 8 స్థానాలు సాధించి కాంగ్రెస్‌తో సమానంగా నిలిచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్‌లో విజయదుంధుబి మోగించింది. తెలంగాణకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది.
TG Lok Sabha Election Results 2024 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐదు మాసాల పాటు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బలమైన లోక్‌సభ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది. దాదాపు రెండు మాసాలు ఆ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికల్ని అమల్లోకి పెట్టారు.
ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావని దేశంలోని పాలనను నిర్ణయించేవనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు. బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశం లేదని విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చేసిన ప్రచారం కూడా ప్రయోజనం చేకూర్చింది.
మోదీని తీసుకురావడంతో మారిన గ్రాఫ్ : రాష్ట్ర బీజేపీ నాయకత్వం అగ్ర నేతలతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీల అమలుపై వైఫల్యం, పదేళ్ల బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధింపజేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఒక దఫా ప్రచారాన్ని రాష్ట్రంలో ముగించారు. మూడుసార్లు రాష్ట్రానికి వచ్చి ఐదు బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత మూడుసార్లు రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చి ఫుల్ జోష్ పెంచారు. తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరించారు. వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టి పసుపుబోర్డు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ వంటి విభజన హామీలని స్వయంగా మోదీ చేతులమీదుగా ప్రారంభించచేసి జనంలోకి సానుకూల సందేశాన్ని పంపించారు.
గ్రామీణ ప్రాంతానికి చేరువైన బీజేపీ : రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఎక్కువ సీట్లను సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేక ఓట్లు బీజేపీకు పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో మాత్రమే గులాబీపార్టీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలిస్తే మిగిలిన అన్నిచోట్ల మూడోస్థానానికే పరిమితమయ్యారు. దీనిని బట్టి చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టి అధికార పార్టీకి ధీటుగా సమస్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది.
'మూడో విడతలో భారీ నిర్ణయాలు'- ఫలితాలు చారిత్రక ఘట్టమన్న మోదీ - Lok Sabha Election Result 2024